Powered By Blogger

Friday, 18 March 2016

మహానటి సావిత్రి

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,
మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్...థడ్...అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. 'ఎవరు మీరు?' అంటే, బదులుగా 'మీ అభిమానిని అమ్మా!' అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి "అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా" అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ 'అన్నయ్య' వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే 'ఆడతనం' ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
'దేవదాసు' లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు 'మాయాబజార్' లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'నీలం సంజీవరెడ్డి' మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు 'గాజారోహణం' చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో 'ఎవరికీ దక్కని' అరుదైన గౌరవం ఇది.
'ఇప్పటికీ' 'ఎప్పటికీ' తెలుగువారి ఖ్యాతిని అఖండజ్యోతిలా వెలిగించేవాళ్ళలో ముందు వరుసలో వుంటుంది ఆమె నటనా జీవితం.
ఆమే 'సావిత్రి'.
సావిత్రి గారు మనల్ని పొగడమనో, గుర్తుంచుకోమనో ఏ రోజూ అడగలేదు. గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్పవాళ్ళు ఎవరూ అడగరు. వాళ్ళ సేవని గుర్తుంచుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒక scene లో మెట్ల మీద నుండి కిందకి దిగాల్సివుంది. తాను చేయాల్సిన scene ఎప్పుడో చేసేసింది. అయినా shooting gap లో expressions లో వ్యత్యాసం అర్ధం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కో సారి ఒక్కో expression తో. ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వం తో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి dedication గురించి "అ ఆ ఇ ఈ" లు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులోనుండి వస్తే అంత కంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని impression కోసం వాడుకుంటే, అంతకంటే అవమానం లేదు.
జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తుచేసుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి వున్నన్ని రోజులు అందులోని పరిమళం లా వుంటుంది తను.
పాదాభివందనాలతో, (facebook నందమూరి తారక రామారవు page నుండి సేకరణ)
Like
Comment

1 comment:

  1. She is the greatest actress. Still she became drinker and fell in the trap of crooks like gemini. Ended in a pauper state.

    ReplyDelete