Powered By Blogger

Thursday, 18 June 2015

విప్లవ వాల్మీకి ఆరుద్ర


విప్లవ వాల్మీకి

బాపు-రమణలకు, ఆరుద్ర అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆరుద్ర జీవించినంత కాలం బాపు రమణల సినిమాలలో ఆరుద్ర పాట లేకుండా ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆరుద్ర నాస్తికుడు, కమ్యూనిష్టు భావజాలం కలవాడు. అయినా ఆరుద్ర శ్రీ రాముని మీద అధ్భుతమైన పాటలు, పద్యాలు వ్రాసారు. “సంపూర్ణ రామాయణం” సినిమా తీస్తున్నప్పుడు “ఒకడు కార్టూనిష్టు, మరొకడు హ్యూమరిస్టు, ఇంకో ఆయన కమ్యూనిష్టు. ఈ సినిమా ఫ్లాప్ అవడం ఖాయం” అని అందరూ గేలి చేశారుట. కానీ ఆ సినిమా అఖండ విజయం సాధించింది. దానికి కారణం ఆరుద్రే ! “ వెడలెను కోదండ పాణి” వంటి సుదీర్ఘ కధా కధనంతో పాటు, సరళ మైన సంభాషణలు, గుహుని పాత్ర పై వ్రాసిన “రామయ్య తండ్రీ” వంటి పాటలు ఆ సినిమాకు అఖండ విజయాన్ని అందించాయి. శ్రీ రామాంజనేయ యుధ్ధం సినిమాలో “శ్రికరమౌ శ్రీ రామ నామం” పాటలో శ్రీ రాముడిని వివిధ కోణాలలో ఆరుద్ర వర్ణించిన విధానం బాపు రమణలకు ఎంతగానో నచ్చిందట. ఇక ఆరుద్ర వ్రాసిన “రాయినైనా కాక పోతిని” ప్రైవేటు గీతం విని, బాపు రమణలు ముగ్ధులైపోయి, గ్రామఫోన్ కంపెనీ వారి వద్ద ఆ గీతం హక్కులు తీసుకొని., తమ “గోరంత దీపం” చిత్రంలో పెట్టుకున్నారు. మరొక కవి సి. నారాయణ రెడ్డి ఆ పాట విని “జీవిత కాలంలో ఇలాంటి పాట ఒక్కటి వ్రాస్తే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది” అని మెచ్చుకున్నారు. “సీతా కళ్యాణం” సినిమాలో “సీతమ్మకు సింగారము చేతుము రారమ్మ” బాపు రమణల సినినమాకు ఆరుద్ర వ్రాసిన గొప్ప పాటలలో ఒకటీ. ఆరుద్ర చివరి రోజులలో అనారోగ్యంతో ఉన్నా, బాపు రమణల “శ్రీ భాగవతం” టీ.వి, సీరియల్ కోసం సుందరకాండని అరవై నిముషాల పాటగా ఇచ్చి ఆ సీరియల్ నిర్మాణం పూర్తికాకముందే నిష్క్రమించారు.. ముళ్ళపూడి చెప్పినట్లు ఆరుద్ర అక్షర శరీరుడు, పరిశోధనా పరమేశ్వరుడు. నాస్తికుడైనా, శ్రీ రామ తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆరుద్ర వాళ్ళిద్దరి దృష్టిలో “విప్లవ వాల్మీకి”.

(courtesy : Umamaheswara Rao Ponnada garu)

1 comment:

  1. మూర్తి గారు, ఆరుద్ర కాని మరెవరైనా ఆస్తికుడు కాని దేవుడి మీద విశ్వాసము లేకపోవచ్చు. కాని వాళ్ళకి దైవచింత, సత్యాన్వేషణ మీద నమ్మకం, మన సంస్కృతి గొప్పతనం మీది అవగాహన ఇటువంటి రచనలకి ప్రేరేపణ. వీళ్ళు వాళ్ళు నమ్మిన మార్గంలో భగవంతుడిని అన్వేషించి చేరుకున్నారని నా అభిప్రాయం.

    ReplyDelete