బుచ్చిబాబు అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ చివరకు మిగెలేది అంటే బుచ్చిబాబు నిస్సందేహంగా గుర్తుకొస్తాడు. బెంగాలీ సాహిత్యమే సాహిత్యం అని ప్రచారం జరుగుతున్న రోజుల్లో, స్వంత ఆలోచనలతో, అభ్యుదయ భావాలతో, మనస్తత్వ విశ్లేషణలతో తెలుగు సాహిత్యాన్ని కుదెపేసిన అడవి బాపిరాజు, చలం, కొడవటిగంటి, గోపిచంద్ వంటి వారి సరసన చేర్చదగ్గ వ్యక్తి బుచ్చిబాబు. 1945-67ల మధ్య ఆకాశవాణిలో పనిచేసారు.
ఆంగ్ల సాహిత్యంలో M.A. చేసిన బుచ్చిబాబుపై బెర్ట్రాండ్ రస్సెల్ ప్రభావం కొంత వరకూ పడినా, లోతైన ఆలోచనలతో, చైతైన్య స్రవంతి (Stream of consciousness) ప్రక్రియతో తనదైన స్వంత గొంతుకని వినిపించాడు ఆయన.
కధకునిగా - మేడమేట్లు, నన్ను గురించి కధ వ్రాయవూ?, కలలో జారిన కన్నీరు, తడిమంటకు పొడినీళ్ళు వంటి విశిష్టమైన 82 కధలను వ్రాసారు.
ఆయన వ్రాసిన ఏకైక నవల “చివరకు మిగిలేది”. 1946-47లో నవోదయ పత్రికలో సీరియల్ గా వచ్చి తెలుగు సాహిత్యంలో అజరామరంగా (All time classic) నిలిచిపోయింది. 1952లో నవల రూపంలో ప్రచురింపబడి, ఆ తరువాతి మలిముద్రణలలో సహితం బెస్ట్ సెల్లర్ గా నిలిచింది.
నాటక రచయితగా బుచ్చిబాబు అనేక రేడియో నాటికలు వ్రాసారు. ఆయన వ్రాసిన “ఆత్మవంచన” నాటిక రేడియోలో వచ్చింది. అందులో సావిత్రి, పుండరీకాక్షయ్య వంటి వారు నటించేవారు. తెలుగు సినీ కళాఖండం “మల్లీశ్వరి” సినిమాకు బుచ్చిబాబు వ్రాసిన “కృష్ణదేవరాయల కరుణ కృత్యం” నాటిక ఆధారం. ఆత్మవంచన నాటిక 1955లో ఆంధ్ర కళాపరిషత్ వారు కాకినాడలో ప్రదర్శించినప్పుడు, ఉత్తమ ప్రదర్శనగా ఎన్నికై, హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
వ్యాసకర్తగా – నన్ను మార్చిన పుస్తకం, నేను-శంకరనారాయణ నిఘంటువు వంటి రచనలు చేసారు. షేక్స్ పియర్ రచనల మీద “షేక్స్ పియర్ సాహితీ పరామర్శ” పరిశోధనకి గాను సాహిత్య ఎకాడమీ అవార్డు అందుకున్నారు.
చిత్రకారునిగా కూడా ప్రతిభ కలవారు బుచ్చిబాబు. ఆయన 1940-60ల మధ్య దక్షిణభారత దేశాన్ని తన పెయింటీంగ్సులో, ల్యాండ్ స్కేప్ లలో చిత్రీకరించారు. 1955లో ఆకాశవాణి, విజయవాడ ప్రాంగణంలో ఆయన చిత్ర ప్రదర్శన కూడా జరిగింది.
1967 లో 51 ఏళ్ళ పిన్న వయస్సుకే జీవితం చాలించిన బుచ్చిబాబు, తెలుగు సాహిత్యంలో ఒక మహోజ్వల తార. పాలగుమ్మి పద్మరాజు శతజయింతిని విస్మరించిన మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, బుచ్చిబాబు శత జయంతిని అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది
(courtesy : Umamaheswara Rao Ponnada).
No comments:
Post a Comment