' ఆశాన్వేషణలో అండగా నిలిచేది శ్రీశ్రీ కవిత్వం "
*************************************************
ఇంత వరకు నడిచిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే. ఒక్క మాటలో చెప్పాలంటే పీడకులూ పీడితులూ నిరంతరం పరస్పర శత్రువులుగా నిలబడి ఒకప్పుడు ప్రచ్ఛన్నంగానూ పోరాటం చేస్తూనే వుంటారు. నరజాతి చరిత్ర సమస్తం.పరపీడన పరాయణత్వం, రణరక్తం ప్రవాహ సిక్తం...దరిద్రులను కాల్చుకు తినడం అన్నారు. అంతేకాదు ....రణరంగం కాని చోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు. ఇలా పీడిత ప్రజల పక్షాన, పీడిత వర్గాలపై యుద్ధాన్ని ప్రకటించిన అక్షరయోధుడు. శ్రామిక, విప్లవ కవిత్వాలకు ఆద్యుడు. సామ్యవాద మరో ప్రపంచం కోసం లక్షలాది యువకులతో కవన కవాతు చేయించిన రణసేనాని. కష్టజీవులకు ఇరువైపులా నిలబడ్డవాడే కవి...! అని చాటి తన జీవితాంతం కష్టజీవులకు అటూ,ఇటూ నిలిచి శ్రమైక జీవన సౌందర్యాన్ని కవిత్వీకరించిన ప్రజాకళాకారుడు. తెలుగు సాహిత్యంలో సంస్కరణవాద స్తబ్దతను బద్దలుకొట్టి సమకాలీన ప్రజాపోరాటాల నండి తను తిరిగి స్ఫూర్తి పొందేవారు. దొంగనోట్ల దొంగవోట్ల రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి వెధవలిచ్చు / సాక్ష్యం.. ఒకసాక్ష్యమా? అంటూ అస్తవ్యవస్థను వివస్త్రీకరించిన శ్రీశ్రీ ''విప్లవం యాడుందిరా...ఆడనే కూడుందిరా.. నీ గూడుందిరా'' అంటూ విప్లవాన్ని వ్యవస్థీకరించిన శ్రీశ్రీ నూట ఐదేళ్ళ కిందట పుట్టి, ఎనభైఐదు ఏళ్ళకింద కలంపట్టి ముప్పైమూడేళ్ళ దాకా తెలుగు అనితర సాధ్యమైన స్థానం సంపాదించిన మహాకవి చనిపోయి నేటికి ముప్పై మూడేళ్ళు అయిన శ్రీశ్రీ ఇవాల్టికి ప్రతినోటా శ్రీశ్రీ కవిత్వం మాట లేని ఉపన్యాసం అరుదు. సాహిత్యం చెరిగిపోని సంతకం, స్థల కాలాలు మారినా, ఎదురుగాలులు వీచినా, పరిస్థితిలో అనేక మార్పులొచ్చినా'' శ్రీశ్రీ కవిత్వం చిరస్థాయిగా నిలిచే వుంటుంది. ఎందుకంటే ఈ సమాజం మారలేదు. సమాజానికీ వ్యక్తికీ సన్నిహిత సంబంధం చెదిరిపోని, నిరంతరం నూతనంగా, ఆదర్శంగా వుండే జీవ చలన రసాయనాలు తన కవిత్వంలో వున్నాయి. కనుకనే ఆయన కవిత్వానికి ఎన్నటికీ ఆదరణ తగ్గనే తగ్గదు. చలనశీలత, పురోగామి శక్తుల సాహచర్యం, ఆశావహదృష్టీ ప్రవాహశీలత ఆయనలోని ప్రత్యేకత...'' భావకవిత్వం ఫాసిస్టు వ్యతిరేక కవిత్వం నుంచి విప్లవ సాహిత్యోద్యమం సినిమా ప్రయోగ పర్వతం ఎక్కడ తడిమినా.... చలనశీల సాహిత్య సృజన చేసిన వాడాయన.. నడువలేనివారిని కూడా నడిపించే.. ఉరికించే ప్రవాహశక్తి వారి కవిత్వంలో వుంది. భవిష్య దిశాదృష్టిని తన కవన, కథ, నాటక, వ్యాసాల్లో రౌద్రంగా, ధ్వనిపూర్వకంగా చెప్పాడు. ''అగాథమగు జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే..! శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే..!! ఏదీ తనంత తానే నీ దరికి రాదూ... శోధించి సాధించాలీ... అదియే ధీర గుణం...!! '' ఆశాన్వేషణలో అండగా నిలిచేది శ్రీశ్రీ కవిత్వం. జీవ లక్షణాల కవిత్వం మానవ హృదయ ప్రేమతత్వం ఎప్పటికీ చెరిగిపోని సూర్యబింబం ఆయన ఎర్రని పెన్ను !! ఆయన మనందరికీ వెన్నుదన్నూ...!!
(శ్రీశ్రీ105 వ జయంతి సందర్భంగా)
భూపతి వెంకటేశ్వర్లు - Nava Telangana Apr.30,2015
No comments:
Post a Comment